Pastor Praveen death ;ఇది ప్రమాదమా లేక కుట్రా?
Pastor Praveen death:
పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అనుమానాస్పద మృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఆయన మరణంపై అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు జరిపించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఆయన హత్యకు గురై ఉండొచ్చనే అనుమానాలు రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి.
పాస్టర్ ప్రవీణ్ గారు తూర్పు గోదావరి జిల్లా చాగల్లులో క్రైస్తవ మహాసభలకు హాజరు కావడానికి బుల్లెట్‌పై రాజమండ్రికి బయలుదేరిన ఆయన రాత్రి సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. సోమవారం రాత్రి రాజమండ్రి సమీపంలోని కొంతమూరు అనే ఊరు వద్ద రోడ్డు పక్కన ఆయన మృతదేహాన్ని అక్కడి స్థానికులు గుర్తించారు.
అయితే ప్పాస్టర్ ప్రవీణ్ శరీరంపై గాయాలు ఉండటం, బలమైన వస్తువులతో కొట్టినట్టుగా కనిపించడం వల్ల అందరిలో పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే గుర్తు తెలియని వ్యక్తులెవరైనా ఆయనను హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా సృష్టించే ప్రయత్నం చేసి ఉండొచ్చంటూ అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ప్రజలు, క్రిస్టియన్ సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
కాగా పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే అటు క్రైస్తవ సంఘాలు, సంఘాల పాస్టర్లు కూడా పెద్ద ఎత్తున ఈ విషయంపై ఆందోళనలకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసనలు చేపట్టారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందంటూ అక్కడివారు డిమాండ్ చేశారు. అయితే పాస్టర్ ప్రవీణ్ మృతి ఉదంతం రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి నిలువెత్తు నిదర్శనమంటూ అందరూ విమర్శించారు.
కాగా ఈ పరిణామాలన్నింటిపై తాజాగా ఆంధ్రా ప్రదేశ్ ప్రభుత్వం స్పందించి సమగ్ర దర్యాప్తునకు పోలీసువారిని ఆదేశించింది. ఈ ప్రమాదం లేదా హత్య పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతిని సోషల్స్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వారు తెలియజేశారు.
పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి మృతి ఘటనపై అన్ని కోణాల్లోనూ సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ఏపీ సిఎం చంద్రబాబు, నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఈ సంఘటన గురించి ఏపీ సిఎం చంద్రబాబు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో ఫోన్‌లో మాట్లాడారని తెలుస్తోంది. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలంటూ ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనకు ఆదేశించినట్లు చెబుతున్నారు.
పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. వివిధ సంఘాలు పాస్టర్ గారి మృతిపై అనుమానాలు వ్యక్తం… pic.twitter.com/JyntFAFn4A
— Lokesh Nara (@naralokesh) March 26, 2025
అయితే పాస్టర్ పగడాల ప్రవీణ్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి లోకేష్ సోషల్ మీడియా వేదికగా అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సంతాపం కూడా తెలియజేశారు. అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారని అన్నారు.
అయితే వివిధ సంఘాలు పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేసి చెప్పారు . ఈ ఘటన పట్ల వంగలపూడి అనిత కూడా స్పందించారు. ఈ ఘటనపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డీ నరసింహ కిశోర్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. పాస్టర్ మరణంపై సమగ్ర విచారణకు జరపాలని వారిని ఆదేశించారు.
ఆయన ఆఖరి క్షణాలు
ప్రమాదం జరిగిన పరిసర ప్రాంతాల వీడియో కెమెరాల్లో నమోదైన సీసీ ఫుటేజ్ ప్రకారం హైదరాబాద్ నుంచి బుల్లెట్‌పై వస్తున్న పాస్టర్ ప్రవీణ్ సోమవారం రాత్రి 11 గంటల 31 నిమిషాలకు ఆయన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు దగ్గర టోల్ గేటు దాటారు. తర్వాత ఆయన 11 గంటల 42 నిమిషాలకు (11 నిమిషాలు) బుల్లెట్‌లో నయారా పెట్రోల్ బంక్ వద్దకు చేరుకున్నారు (ఈ 2 ప్రాంతాల మధ్య దూరం కనీసం 10-11 కిలో మీటర్లు) అయితే సరిగ్గా ఆ పెట్రోల్ బంకుకు ఎదురుగా రోడ్డుపై నుంచి ఎడమవైపు గట్టు కిందకు ప్రవీణ్ బుల్లెట్‌తో సహా పడిపోయారు.
ప్రమాదమా లేక కుట్రా?
ఈ ఘటనపై అందరిలోనూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి సహజ ప్రమాదమా లేక ఎవరైనా పథకం ప్రకారం చేసిన హత్యా అనే కోణంలో పోలీసులు ఈ సంఘటన మీద దర్యాప్తు ప్రారంభించారు. అయితే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు అయిన కేఏ పాల్, ఇంకా ఇతర క్రైస్తవ మత పెద్దలు ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర కోణం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే గత కొంతకాలంగా పాస్టర్ ప్రవీణ్ కు కొందరు వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన మరణం అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని అందరిలోనూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
క్రైస్తవ సమాజంలో తీవ్ర దిగ్భ్రాంతి
పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణ వార్త క్రైస్తవ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సామాజిక సేవలో నిమగ్నమై ఉన్న ఆయనకు రెండు రాష్ట్రాలలో అనేక మంది అనుచరులు ఉన్నారు. అయితే ఆయన మృతితో వారి మధ్య విషాదం అలుముకుంది. ఈ సణగటన పై దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ కేసును ఖచ్చితంగా పరిశీలించాలని, న్యాయం జరిగేలా చూడాలని విశ్వాసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.more