తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు చివరికి ఖరారయ్యాయి. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు అయిన విజయశాంతితో పాటు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌లను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించింది. అయితే ఇప్పటికే ఓ సీటును సీపీఐకి కాంగ్రెస్ ఇచ్చింది కాగా, అధిష్టానం కోటాలో విజయశాంతికి టికెట్ వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది.
అసలు విజయశాంతి పేరు ఊహించని విధంగా తెరపైకి రావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో చేరిన సమయంలోనే ఆమెకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విజయశాంతిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అద్దంకి దయాకర్‌కు కూడా ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారు. అయితే శంకర్ నాయక్ పేరు ఎవరు ప్రస్తావించకపోయినప్పటికీ ఆయనకు కూడా టికెట్ రావడం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలో చర్చనీయాంశంగా మారింది అని చెప్పుకోవచ్చు.
అంతే కాదు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కొత్త ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తనదైన స్టైల్‌లో పార్టీ లోని ఇతర అభ్యర్థుల ఎంపిక చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం ఎక్కువ పనిచేసినవారికి, పార్టీలోని పాత నేతలకు ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే మీనాక్షి నటరాజన్ స్పష్టం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసలు ఎవరూ ఊహించని విధంగా విజయశాంతి, శంకర్ నాయక్ పేర్లు తెరపైకి రావడం గమనార్హం. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో అద్దంకి దయాకర్ మాల సామాజిక వర్గ నేతకు పార్టీ లో ప్రాధాన్యత లభించింది.
మరోవైపు, తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితులకు కూడా టికెట్ దక్కుతుందని అందరూ ఆశించినప్పటికీ అయితే అలా కూడా జరగలేదు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ ప్రభావితం చూపే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఎమ్మెల్సీ టికెట్ దక్కుతుందని భావించినప్పటికీ వారికి కూడా నిరాశ ఎదురైంది. ముఖ్యమంత్రి రేవంత్ మిత్రుడుగా పేరున్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత అయిన కుసుమ కుమార్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగినప్పటికీ అయితే చివరికి ఆయనకు కూడా మొండి చేయే దక్కింది.
హైదరాబాదులో దాదాపుగా 5 లక్షల మందికి పైగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటంతో కుసుమకుమార్ ఎంపిక కలిసొస్తుందని రాష్ట్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావించింది. గత కొన్ని నెలల క్రితం కమ్మ గ్లోబల్ ఫోరం (KGF) సమావేశాన్ని ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డిని కూడా కుసుమకుమార్ ఆ సమావేశానికి ఆహ్వానించారు. దీంతో కుసుమ కుమార్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఖరారవుతుందని అందరూ ఊహించారు కానీ, రాష్ట్ర నాయకత్వం వారి అంచనాలకు భిన్నంగా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయడం గమనార్హం. అయితే ఎంబీసీల నుంచి మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, చరణ్ కౌశిక్ రేసులో ఉన్నప్పటికీ పాపం వారిని కూడా పక్కనపెట్టారు.more