ముగిసిన పాకిస్థాన్ ఓట్ల లెక్కింపు గెలుపు ఎవరిదంటే?
పాకిస్తాన్‌లో ఎంతో ఉత్కంఠ రేపిన ఓట్ల లెక్కింపు ఎట్టకేలకు ముగిసింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీన పాకిస్థాన్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ECP) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం చాలా రకాల కేసుల్లో జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ ‘పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (PTI) ను బలపరచిన అభ్యర్థులు 101 స్థానాల్లో గెలిచినట్టు పాక్ ఈసీపీ తెలిపింది. అలాగే పాక్ మాజీ ప్రధాని అయిన నవాజ్ షరీఫ్‌కు చెందిన ‘పీఎంఎల్-ఎన్’ పార్టీ 75 సీట్లు, బిలావల్ జర్దారీ భుట్టోకు చెందిన ‘పీపీపీ’కి 54 సీట్లు, ‘ఎంక్యూఎం-పీ’ పార్టీకి 17 సీట్లు, ఇంకా ఇతర పార్టీలు మిగిలిన స్థానాల్ని సొంతం చేసుకున్నాయని పాక్ ఈసీపీ వెల్లడించింది. అయితే అత్యధికంగా ఇండిపెండెట్ అభ్యర్థులే ఎక్కువ స్థానాలు సొంతం చేసుకోవడంతో వారిదే పైచేయి అయ్యింది.
అయితే 265 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించిన పాకిస్తాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే, 133 సీట్లు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అయితే ఏ ఒక్క పార్టీ కూడా అన్ని స్థానాల్ని కైవసం చేసుకోలేదు. పీటీఐ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 101 స్థానాల్లో గెలిచి పైచేయి సాధించారు కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వారికి ఇంకా 32 సీట్లు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బిలావల్ జర్దారీ భుట్టోకు చెందిన ‘పీపీపీ’ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నవాజ్ షరీఫ్‌కు చెందిన ‘పీఎంఎల్-ఎన్’ పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పిటీఐ మినహా మిగిలిన పక్షాలన్ని కలిసి కచ్చితం గా రావాలని నవాష్ షరీఫ్ పిలుపునిచ్చారు. అటు నవాజ్‌కు అనుకూలంగా సైన్యాధ్యక్షుడు ఆసీమ్ మునీర్ సైతం రంగంలోకి దిగాడు. ఈ పరిస్థితుల్ని చూస్తుంటే నవాజ్ మళ్ళీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కానున్నట్టు తెలుస్తోంది.
ఇదంతా ఇలా ఉండగా నిజానికి పాకిస్తాన్ జాతీయ అసెంబ్లలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. ఇందులో 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరిగితే మిగతా 70 స్థానాలను మైనారిటీలకు మరియు మహిళలకు కేటాయించడం జరుగుతుంది. ఈ సారి ఒక అభ్యర్థి చనిపోవడంతో 265 సీట్లకే ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది . అనంతరం ఓట్ల లెక్కింపు మాత్రం సుదీర్ఘంగా సాగింది చెబుతున్నారు కానీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదులు రావడంతో ‘ఎన్‌ఏ-88’ సీటు ఫలితాల్ని నిలిపివేశారు. ఇప్పటికైతే మొత్తం 264 స్థానాల ఫలితాల్ని ఎన్నికల సంఘం విడుదల చేసింది.